ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వేలూరులో చోటు చేసుకుంది. వివరాలు.. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాశన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె సాధన ప్లస్‌వన్ చదువుతోంది. వేలూరు సమీపంలోని కరుగంబత్తూరు మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన రామ్‌కుమార్ కార్మికుడు. శనివారం రాత్రి సాధన ఇంటిలో సాధన మృతి చెంది ఉండగా రామ్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని భారతిదాశన్, దీపలక్ష్మి గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సాధనను.. రామ్‌కుమార్ గొంతు నులిమి హత్య చేసి అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. రామ్‌కుమార్, సాధన ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం సాధన తల్లిదండ్రులకు తెలియడంతో ఖండించారు. దీంతో సాధన.. రామ్‌కుమార్‌తో మాట్లాడటం లేదు. ఆగ్రహించిన రామ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు.