Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడిగా, ట్రెండ్ సెట్టర్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన తేజ దాదాపు పుష్కర కాలంగా సక్సెస్ లేకుండా కొట్టుమిట్టాడాడు. ఎట్టకేలకు రానాతో తెరకెక్కించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తేజకు సక్సెస్‌ను తెచ్చి పెట్టింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తేజకు వెంటనే సినిమాలకు దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. అందులో మొదటగా వెంకటేష్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ వెంటనే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్‌ను చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో హీరోయిన్గా నటించిన కాజల్‌ను తన తర్వాత సినిమాలో కూడా కంటిన్యూ చేయాలని తేజ భావిస్తున్నాడు. వెంకటేష్‌తో తెరకెక్కించబోతున్న చిత్రంలో హీరోయిన్గా కాజల్‌ను ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో నటించిన కాజల్ తాజాగా వెంకీతో నటిస్తుంది. యువ హీరోలతో నటించి మెప్పించిన కాజల్ ప్రస్తుతం స్టార్ సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఒప్పుకోవడం సాహస నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సహజంగా అయితే కుర్ర హీరోలతో నటించేందుకు హీరోయిన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
కాజల్ మాత్రం కెరీర్ ముగింపు దశకు వచ్చిన కారణంగా ఏ హీరోతో అయితే ఏంటీ అని భావిస్తుందో ఏమో వరుసగా సీనియర్ హీరోలతో నటించేందుకు ఓకే చెప్పడంతో పాటు, ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈమె తమిళ ‘క్వీన్’ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. వెంకటేష్‌తో నటించబోతున్న సినిమా సక్సెస్ అయితే కాజల్‌కు మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కాజల్ ప్రస్తుతం చేస్తున్న రెండు తమిళ చిత్రాలు వచ్చే సంవత్సరంలో విడుదల కాబోతున్నాయి. తెలుగులో ఈమె వెంకటేష్‌తో మాత్రమే నటించబోతుంది. తెలుగులో కాజల్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.