Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ నలుగురు స్టార్ హీరోల్లో వెంకీ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగి సత్తా చాటిన వెంకటేష్ ఇప్పటికి కూడా సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. వెంకటేష్ సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇతర హీరోల మాదిరిగా కాకుండా తన వయస్సు తగ్గ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ వయస్సులో లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులు తిరష్కరిస్తారనే ఉద్దేశ్యంతో ‘గురు’ వంటి విభిన్న తరహా చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇక మీదట కూడా తాను అలాంటి సినిమాలు మాత్రమే చేస్తాను అని, వయస్సు పైబడిన వ్యక్తి పాత్రల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.
వెంకటేష్ కెరీర్‌ను ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సూపర్ హిట్ చిత్రాలు అన్నీ కూడా రీమేక్‌లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన గోపాల గోపాల, గురు చిత్రాలు కూడా రీమేక్ అనే విషయం తెల్సిందే. త్వరలోనే మరో రీమేక్‌లో కూడా వెంకటేష్ నటించేందుకు సిద్దం అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల బాలీవుడ్లో విడుదలైన ‘హిందీ మీడియం’ చిత్రాన్ని తెలుగులో వెంకీ రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ‘తెలుగు మీడియం’ అనే టైటిల్‌తో ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాను రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టింది.
ఒక చిన్న చిత్రంగా హిందీలో తెరకెక్కి విడుదలై ‘హిందీ మీడియం’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో ఇర్ఫాన్ ఖాన్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించేందుకు సిద్దం అయ్యాడు. విద్యాబాలన్ ముఖ్య పాత్రలో నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. భారీ విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘హిందీ మీడియం’ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో నందిని రెడ్డి అండ్ టీం ఉన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతతో కలిసి సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. వెంకటేష్‌కు జోడీగా ఈ చిత్రంలో ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.