Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజ్ఞాన్ రత్తయ్య… విద్యారంగంలో ఓ దిగ్గజం. నేడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థకు ఆయనే పునాదులు వేశారు. అయితే మైదానం లేకుండా కేవలం బిల్డింగ్స్ లోనే క్లాసులు నడిపే విధానానికి ఆయన వ్యతిరేకం. కానీ ఓ ఒరవడి మొదలయ్యాక దాని వేగాన్ని ఆపడం అది స్టార్ట్ చేసిన వారి వల్ల కూడా కాదు అనడానికి రత్తయ్య ఓ ఉదాహరణ. అందుకే నేటి విద్యా వ్యవస్థలో ఆయన కూడా ఇమడలేకపోతున్నారు. విద్యారంగంలో సక్సెస్ అయినా దాంతో పాటు ఆయనకు ఎంతో ఇష్టం అయినవి జర్నలిజం, రాజకీయం. ఆ రెండు రంగాల్లోనూ ఆయన కాలు పెట్టారు కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆయన స్థాపించిన సుప్రభాతం పత్రిక ఒకానొక దశలో ఇండియా టుడే లాంటి జాతీయ స్థాయి పత్రికతో ఢీకొట్టింది. అయితే నిర్వహణ లోపాలతో కాలానుగుణంగా అది మూత పడింది. ఇక రాజకీయానికి వచ్చేసరికి ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని. ఎన్టీఆర్ టీడీపీ తరపున ఆయన బాపట్లలో ఎంపీ గా పోటీ చేసి ఓ సారి, మల్కాజిగిరిలో లోక్ సత్తా తరపున ఎంపీ గా పోటీ చేశారు. కానీ విజయం ఆయన్ని వరించలేదు.
ఆ రెండు ఎన్నికల ఫలితాలతో రత్తయ్య అప్పటికప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే లాభం లేదని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే కిందటి ఎన్నికల ముందు వైసీపీ లో చేరినా పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే అప్పటినుంచి కొడుకు కృష్ణదేవరాయ ని గుంటూరు వైసీపీ రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఈసారి గుంటూరు నుంచి రత్తయ్య కుమారుడు వైసీపీ తరపున ఎంపీ కాండిడేట్ గా పోటీ చేసే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ వర్గాల కన్నా ముందే గుంటూరు ఎంపీ, ఆయన ప్రత్యర్థిగా బరిలో నిలిచే ఛాన్స్ వున్న గల్లా జయదేవ్ బయటకు చెప్పేసారు. చెప్పడమే కాదు గట్టి పోటీ జరిగే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ మాటలతో రాజకీయాల్లో గెలుపు రుచి చూడని రత్తయ్య హ్యాపీగా ఫీల్ అయ్యి వుంటారనడంలో సందేహం లేదు.