Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డిగా వైవిధ్యమైన నటనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఆకట్టుకునేలా మాట్లాడటంలో కూడా దిట్టలా కనిపిస్తున్నాడు. ప్రముఖ కన్నడ నటుడు గణేశ్ నటించిన చమక్ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ మాటలు అందరినీ కట్టిపడేశాయి. తొలుత చమక్ హీరో గణేశ్ గురించి మాట్లాడాడు విజయ్. హీరోగా తన తొలిచిత్రం పెళ్లిచూపులు వందరోజులు ఆడిందన్న గర్వంతో ఓసారి గోల్డెన్ స్టార్ గణేశ్ గురించి గూగుల్ లో వెతికానని, ఆయన నటించిన చిత్రం 800 రోజులు ఆడిందని తెలిసి షాకయ్యానని విజయ్ చెప్పాడు. గణేశ్ స్టార్ డంను ఎంతగానో ప్రశంసించాడు. అనంతరం కర్నాటక రాష్ట్రంపై విజయ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కర్నాటక భారత్ కు గొప్ప నటులు, క్రికెటర్లను పరిచయం చేసిందని కొనియాడాడు. కర్నాటక అంటే రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, ఇలా ఎంతో మంది క్రికెటర్లు గుర్తుకొస్తారని, 40శాతం భారత క్రికెటర్లు ఈ రాష్ట్రానికి చెందినవారే అని, అందుకే కర్నాటక అంటే అందరికీ ఎంతో ఇష్టమని విజయ్ అన్నాడు. కర్నాటక దేశానికి అందించిన ఫిలిం స్టార్లనూ విజయ్ ప్రస్తావించాడు.
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ అనుష్క కర్నాటకలో పుట్టిన సూపర్ స్టార్లని కొనియాడాడు. తన తదుపరి చిత్రం ఏ మంత్రం వేశావే లో హీరోయిన్ గా నటిస్తోన్న రష్మిక మందన కూడా కన్నడ అమ్మాయేనని విజయ్ చెప్పుకొచ్చాడు. కన్నడ హీరో చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు కాబట్టి… ముఖస్తుతి కోసం విజయ్ ఇలా ఆ రాష్ట్రం గురించి పొగిడాడు అనుకున్నప్పటికీ..ఈ హీరో మాటల్లో అతిశయోక్తి మాత్రం లేదు. నిజంగానే కన్నడ దేశానికి సూపర్ స్టార్లను అందించింది. అలాగే కన్నడ అమ్మాయిలు చాలా అందెగత్తలని కూడా పేరు. ఇది నిజమేననడానికి చాలా మంది ఉదాహరణగా కూడా నిలుస్తున్నారు. అందానికి పర్యాయపదంగా భావించే ఐశ్వర్యారాయ్ స్వస్థలం కర్నాటకే. ఇప్పుడంటే బాలీవుడ్ లో స్థిరపడిపోయి ఉత్తరాది నాయికగా గుర్తింపు పొందుతోంది కానీ ఆమె మూలాలన్నీ కర్నాటకలోకి చిక్ మంగుళూరులోనే ఉన్నాయి. అలాగే తమిళనాడు ప్రజల అమ్మగా నీరాజనాలు అందుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా కర్నాటకకు చెందినవారే.
తెలుగులో పాతతరం నాటి హీరోయిన్లలో సంచలన నాయికగా పేరుతెచ్చుకున్న బి.సరోజాదేవి కన్నడవాసే. అలాగే 90ల్లో టాలీవుడ్ కొత్త చరిత్ర సృష్టించి మహానటి సావిత్రి తరువాత ఆ స్థాయి హీరోయిన్ అనిపించుకున్న సౌందర్య కూడా కన్నడ అమ్మాయే. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక చిత్రాల ఆస్థాన నాయకిగా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న దీపికా పదుకునే కూడా కర్నాటక నుంచి వెళ్లి హిందీ సినిమాల్లో స్థిరపడ్డ నటే. వీరే కాదు..ఇంకా అనేకమంది కర్నాటకకు చెందిన నటీనటులు దక్షిణాదితో పాటు అనేక భాషల్లో నటిస్తూ.. తమకూ, తమ రాష్ట్రానికి పేరు తెస్తున్నారు. విజయ్ చెప్పినట్టుగా కర్నాటకను అందరూ ఇష్టపడేలా చేస్తున్నారు