విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్‌ మేకొవ‌ర్

విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్‌ మేకొవ‌ర్

పూరి ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. స్టార్లున్నా, లేకున్నా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం అల‌వాటు చేసుకున్నాడు.రౌడీ లాంటి హీరో దొరికితే రెచ్చిపోవడం ఖాయం. పూరి ఫామ్ లోకి వ‌చ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుందో `ఇస్మార్ట్ శంక‌ర్‌` నిరూపించింది. అదే ఊపులో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా మొద‌లెట్టాడు. ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుగుతోంది. పూరి మేకింగ్ స్టైల్ గురించి తెలియంది కాదు. సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియ‌నంత వేగంగా ప‌ని చేస్తాడు. విజ‌య్ సినిమానీ చ‌క చ‌క పూర్తి చేస్తున్నాడు. ముంబై షెడ్యూల్‌లో ఇప్ప‌టికే 20 నిమిషాల నిడివి ఉన్న సినిమా తీసేశాడ‌ట పూరి. ఈ 20 నిమిషాల్లోనూ విజ‌య్‌పైనే కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించాడు.

అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ మేకొవ‌ర్ చూస్తే… షాకింగ్‌గా అనిపిస్తోంద‌ట‌. ఈ సినిమాతో స‌రికొత్త విజ‌య్‌ని చూడ‌డం ఖాయ‌మ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోస‌మే మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విజ‌య్ శిక్ష‌ణ తీసుకున్నాడు. దానికి తోడు యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌డంలో పూరి దిట్ట‌. అందుకే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా వ‌చ్చాయ‌ని, ఈ సినిమాకి అవే పెద్ద హైలెట్ అని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్‌తో క‌థ‌ని చెప్పే విధానంలోనూ పూరి మారాడు. ఆ మార్పు ఈ సినిమాలోనూ క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. మొత్తానికి పూరి – రౌడీల కాంబో… స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టించబోతుంద‌న్న సంకేతాలు ముందే అందేస్తున్నాయి. ఫైన‌ల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి.