Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ తో చావో రేవో అన్నరీతిలో తలపడి విజయం సాధించిన తరువాత గుజరాత్ లో బీజేపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను మారుస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీకే మళ్లీ అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. అలాగే ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కూ మరో ఛాన్స్ ఇచ్చారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని పార్టీ పరిశీలకునిగా బీజేపీ అధిష్టానం నియమించింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా విజయ్ రూపానీని ఎన్నుకున్నట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు.
బీజేపీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేసులో విజయ్ రూపానీ పేరు అసలు వినపడలేదు. కేంద్రమంత్రులు మన్ సుఖ్ మాండవియా, స్మృతి ఇరానీ రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. వీటికి తెరదించుతూ రూపానీనే పార్టీ ఎన్నుకుంది. 2014లోక్ సభ ఎన్నికల తర్వాత మోడీ ప్రధాని కావడంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో ఆమె రాజీనామా చేయడంతో విజయ్ రూపానీ సీఎం అయ్యారు. ఆయన నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ప్రధాని విస్తృత ప్రచారంతో బీజేపీ 99 స్థానాల్లో గెలుపొందగా… ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం 100కు చేరింది. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇది వరుసగా ఆరోసారి.