వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ తెలిపాడు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్ అగ్నికి ఆహుతి చేసిన విషయం విదితమే. సోమవారం జరిగిన ఈ ఘటనలో 60 శాతం గాయాలపాలైన సురేశ్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వైద్యుల సమక్షంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు.
దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లానని మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు నిప్పంటించుకుని విజయారెడ్డిని కూడా తగులబెట్టానని పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి దారుణ హత్యపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. హత్య వెనుక ఉన్న మాఫియా ఆగడాలను బయటపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
బాచారంలోని దాదాపు 412 ఎకరాల భూమి గత 70 ఏళ్లుగా వివాదాల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని… రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్ యాసిన్ వారసులు తెరపైకి వచ్చారు. కాగా వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు ఇప్పటికే సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్ కుటుంబం కూడా ఉంది.
ఈ క్రమంలో తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని చేజిక్కించుకునేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిందితుడు సురేష్ తనదిగా పేర్కొంటున్న భూమి మార్కెట్ విలువ సుమారు 40 కోట్ల రూపాయలని సమాచారం.