Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీలు తమ రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. తొలుత తన ఆరోపణలలో చంద్రబాబు పేరు వాడని ఆయన ఇప్పుడు చంద్రబాబు పేరు చెప్పే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే శ్రీవారి నగల మాయం చేసారని వస్తున్న ఆరోపణలపై వైకాపా రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పందించారు. తిరుమల పోటు నేలమాళిగలో తవ్వకాలు జరిపారన్న ఆరోపణలను సమర్థించిన విజయసాయిరెడ్డి ఆ విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని ఆరోపించారు. ఇప్పటికిపుడు కేంద్రం సీబీఐ సోదాలకు ఆదేశించి 12 గంటల్లోపల చంద్రబాబు నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడటం ఖాయం అని ఆయన అన్నారు.
చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 గంటల కంటే ఎక్కవ సమయం ఇస్తే… ఆ ఆభరణాలన్నీ విదేశాలకు తరలిపోతాయని చెప్పారు. కేవలం హెరిటేజ్ సంస్థల వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులను కూడబెట్టడం అసాధ్యమని అన్నారు. లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు… సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలు చేయబట్టే చంద్రబాబుకు అన్ని ఆస్తులున్నాయన్నారు. టీడీపీ ఎవరిపైన ధర్మపోరాటం చేస్తుంది ? చంద్రబాబు పోరాటం ప్రజల పైనా? అని ప్రశ్నించారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ…తెలుగు డ్రామాల పార్టీ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ధర్మ పోరాటం చేపట్టారని ఆరోపించారు. గతంలో వైసీపీ అడిగితే ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ ఇవ్వలేదని…ఇప్పుడు టీడీపీకి ఎలా ఇచ్చారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.