Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్రప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు బయటికి వచ్చిన తర్వాత… బీజేపీ, వైసీపీలు నెమ్మదినెమ్మదిగా ముసుగు తీయడం మొదలుపెట్టాయి. ప్రశంసలు, భేటీల విషయంలో గతంలో ఉన్న మొహమాటాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాయి. హోదాపై పోరాటం చేస్తామంటూనే వైసీపీ… మరోపక్క బీజేపీప్రభుత్వంపై అపారవిశ్వాసం ఉన్నట్టు చెబుతోంది. విభజన హామీల అమలుకోసం టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు అలుపెరగని పోరాటం చేస్తోంటే… వైసీపీ మాత్రం సొంత రాజకీయ ప్రయోజనాల లెక్కల్లో మునిగితేలుతోంది. విభజన హామీల అమలును అటకెక్కించేసే అవకాశం ఉండడంతో ప్రధాని వైసీపీని చేరదీస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, వైసీపీ నేతల వైఖరి చూస్తే రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పదంతో ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. నిన్నటికి నిన్న రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ చివరిక్షణంలో రద్దుచేసి మరీ వైసీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమయింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సమయంలోనే ఢిల్లీలో జరిగిన మరో ఘటన వైసీపీ, బీజేపీ రహస్యంగా కొనసాగిస్తున్న మిత్రబంధాన్ని బహిర్గతం చేసింది.
వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి మోడీ అపాయింట్ మెంట్ కోసం మోడీ కార్యాలయంలో నిరీక్షించారు. సుమారు గంటపాటు విజయ్ సాయిరెడ్డి అక్కడే ఉన్నారు. అయితే ఆయన అక్కడ ఎదురుచూస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు అటుగా రావడంతో విజయ్ సాయిరెడ్డి వెంటనే బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన వెంట జగన్ బంధువు వినీత్ రెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే… మీడియా చూస్తున్నప్పటికీ విజయ్ సాయిరెడ్డి ధైర్యంగానే ప్రధాని కార్యాలయంలో ఉండొచ్చు. కానీ మీడియా కంటపడగానే ఆయన అక్కడి నుంచి జారుకోవడం, ఆయన వెంట జగన్ బంధువు ఉండడం… అనేక అనుమానాలకు తావిస్తోంది. కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం, పీఎంవో చుట్టూ ఏ2 నిందితుడి ప్రదక్షిణాలు నిజమేనని తేలిపోయింది. చంద్రబాబే అడిగినట్టు వైసీపీ, బీజేపీ తమ చర్యలతో ఏ సంకేతాలు పంపిస్తున్నాయో ఆ పార్టీలే వివరణ ఇవ్వాల్సిన అవసరముంది.