విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి ఘటన తర్వాత జగన్ నేటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరే ముందు తల్లి విజయలక్ష్మితో నిన్న ప్రెస్మీట్ పెట్టించారన్న విషయం తెలిసిందే. సహజంగా ఆమె రాజకీయ నాయకురాలు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ నేత అవతారం ఎత్తాల్సి వచ్చిందని కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి అనడరికీ తెలుసు.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆమెకు ఏమి రాసిచ్చి పంపుతారో అదే మీటింగ్ లో అప్ప చెబుతారు. నిన్న కోడి కత్తి ఘటనపై ప్రెస్మీట్లోనూ పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పేసి ఉంటే సరిపోయేది. కానీ ఆమె ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పడంతో కోడి కత్తి దాడి ఘటన గురించి జగన్ ఏముకున్నారో విజయమ్మ ఏమనుకున్నారో అసలు వైసీపీ దాన్ని ఎలా రాజకీయం చేయాలనుకుందో తేటతెల్లం అయ్యింది. కత్తితో దాడి చేసిన వ్యక్తి అప్పటి వరకూ మా పార్టీ వ్యక్తేనని తెలియదు. ఎవరో పిచ్చోడు ఏదో చేశాడని జగన్ అనుకున్నాడు అని డీజీపీ చెప్పక తెలిసిందని వైఎస్ విజయమ్మ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే స్వయానా డీజీపీ ప్రకటించినా కూడా ఈ విషయాన్నీ వైసీపీ పెద్ద రాజకీయం చేసింది. ఆ కోడి కత్తి ఘటనను నేరుగా చంద్రబాబుకు ఆపాదించేందుకు ఢిల్లీకి వెళ్లి మరీ పెద్ద ప్రయత్నమే చేశారు.
ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ ఆస్పత్రిలో చేరి దాదాపుగా పదిహేను రోజులు బయటకు రాకుండా చేసిన రాజకీయం విజయమ్మ వ్యాఖ్యలతో ఇప్పుడు తేలిపోయినట్టయ్యింది. ఎవరో పిచ్చోడు చేశాడన్న అభిప్రాయంతో జగనే ఉన్నారనేది ఆ ఘటన జరిగిన తర్వాత జగన్ బాడీ లాంగ్వేజ్ ను చూస్తే అర్థమైపోతుంది. కానీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత మరి పై నుండి వచ్చిన ఆదేశాలో లేక రాజకీయ వ్యూహకర్తల ప్లానింగో ఏమో కానీ వెంటనే ప్లాన్ మార్చారు. దీంతో ఒక రకంగా ఈ కేసు విషయంలో బాధితుడైన జగన్ వ్యవహరించిన తీరు కోర్టుల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అందుకే ఇక్కడ సానుభూతి రావాల్సింది పోయి విమర్శలు మూటగట్టుకున్నారు.