పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు అప్పుడూ.. ఇప్పుడూ తపిస్తూనే ఉంది విజయశాంతి. 1964లో వరంగల్‌లో పుట్టినా మద్రాస్ నుంచే ఆమె విజయప్రస్థానం పరుగులుతీసింది. సినీరంగంలో విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ తెలుగుచిత్రసీమలో శిఖరాగ్రానఉన్నా.. ఆమె ఎప్పటికప్పుడు పుట్టిన తెలంగాణగడ్డ రుణం తీర్చుకోవాలనే ప్రయత్నించింది. ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి సినిమాలతో సామజిక తెలంగాణ ఆవశ్యకతను ప్రతిభంభించింది. తనదైన సినీ రంగం నుంచే పీడిత ప్రజలను జాగృతి చేసేందుకు శ్రమించింది. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడే గళమెత్తి ‘తల్లితెలంగాణ’ పార్టీ స్థాపించింది. ఒక మహిళ తెలంగాణ జెండా ఎగురేసిందంటే ఆ ఘనత విజయశాంతిదే. అంతేకాదు, తాను సంపాదించిన సొమ్ముల్లో చాలా భాగం పార్టీ కోసమే ఖర్చుపెట్టింది రాములమ్మ. తర్వాతరోజుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించడం, విజయశాంతి తన తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం జరిగిపోయాయి. అనతికాలంలోనే కేసీఆర్ చెల్లెమ్మగా గుర్తింపు పొందిన విజయశాంతి.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో ఆపార్టీలో చేరిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వచ్చిన 2014 ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయశాంతి.. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి చేతిలో 39 600 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ కు 89 654 ఓట్లు రాగా, విజయశాంతికి 50, 054 ఓట్లు వచ్చాయి.
కిందటి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మ్రోగించడం.. అధికారంలోకి రావడం తెలిసిందే. దురద్రుష్టం వెంటాడి టీఆర్ఎస్కు దూరమై ఓటమిపాలైన విజయశాంతి.. అప్పటినుంచీ అనారోగ్య కారణాల రిత్యా క్రియాశీల రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకీ దూరంగా ఉంటూ వస్తున్నారు.
2018 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మళ్లీ రంగంలోకి దిగిన విజయశాంతి ప్రచారం మాత్రమే చేస్తానని పోటీకి దూరమని మొదట్లో ప్రకటించారు. అయితే, మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో స్ట్రాటజీ మార్చుకున్న ఆమె, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారు. అయితే, ఇప్పటికే మెదక్ టిక్కెట్ విషయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నర్సారెడ్డికి ఇస్తామని హైకమాండ్ మాటివ్వడంతో ఇప్పుడు విజయశాంతి దుబ్బక నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు, మహాకూటమి దుబ్బాక టికెట్‌పై పట్టుబడుతుండటం.. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఏంజేబీ ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డిలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికిచ్చినా మిగతా ఇద్దరు సహకరించడం కష్టమేనని భావించిన అధిష్టానం తెరపైకి విజయశాంతి పేరును తెచ్చినట్లు కూడా వినిపిస్తోంది.