రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని వసూళ్లను బాహుబలి దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున బాహుబలి రెండు పార్ట్లు విజయం సాధించిన నేపథ్యంలో బాహుబలికి మూడవ పార్ట్ ఉండాలని ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు. అయితే రాజమౌళి ఇప్పటికే బాహుబలి మూడవ పార్ట్ ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం పలు సార్లు బాహుబలి 3 ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఆ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాకు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బాలీవుడ్లో పది సినిమాలకు కథలు ఇచ్చేందుకు విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని సినిమాలను కూడా కొత్త దర్శకులతో చేయించేందుకు ఆయన సిద్దం అవుతున్నాడు. ఆ పది సినిమాల్లో ఒక సినిమాగా బాహుబలి 3 ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ నటీ నటులతో కొత్త దర్శకుడితో ‘బాహుబలి 3’ రాబోతుందని తెలుస్తోంది. బాహుబలి మొదటి రెండు పార్ట్లు సేమ్ కథతో కొనసాగింపుగా కొనసాగాయి. కాని మూడవ పార్ట్‌కు మొదటి రెండు పార్ట్‌లకు ఏమాత్రం సంబంధం ఉండదు అని, అసలు బాహుబలి నేపథ్యంకు దీనికి సంబంధం ఉండదు అని ఆయన అంటున్నాడు. టైటిల్ మాత్రమే బాహుబలి అని, టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థం అవుతుందని విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చాడట. బాలీవుడ్లో బాహుబలి 3 తెరకెక్కబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.