మోడీ హత్యకు కుట్ర….వరవరరావు అరెస్ట్ !

నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విరసం నేత వరవరరావును పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు ఈ ఏడాది జూన్‌లో గుర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఆత్మాహుతిదాడితో హత్య చేసిన రీతిలోనే మోడీని కూడా అంతమొందించాలని మావోయిస్టు సానుభూతిపరుల వద్ద లభ్యమైన ఒక ల్యాప్టాప్ లో ఉన్నట్లు తేలింది. ఈ లేఖలో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయనపై పుణె పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన పుణె స్పెషల్ పార్టీ పోలీసులు జవహర్ నగర్‌లోని వరవరరావు ఇంటితో పాటు ఆయన ఇద్దరు కూతుళ్ళు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు టేకుల క్రాంతితో పాటూ మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో సోదాలు జరిపారు. వరవరరావును తన ఇంటిలోనే 8 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. ఆయన నివాసంలో ఉన్న ప్రతి పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ, సోదాలను మొత్తం వీడియో తీశారు.

Varavara Rao And Modi

ఆయన్ని అరెస్ట్ చేసి తరలించడానికి ప్రయత్నించగా ప్రహా సంఘాల నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వరవరరావు ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే వారిని చెదరకొట్టి వరవరరావును అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆయణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయణ్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం పుణే తరలించనున్నట్లు తెలుస్తోంది.

Virasam Leader Varavara Rao Arrest

 

ఈ విషయమై వరవరరావు భార్య హేమలత మాట్లాడుతూ, గత నలభై ఏళ్లలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయని కానీ ఈరోజు జరిగిన సోదాలు మునుపెన్నడూ చూడలేదని అన్నారు. వరవరరావుని ఎన్నోసార్లు పోలీసులు అరెస్టు చేశారని, కానీ ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటి వాళ్లు లోపలికి రాలేదని, చాలా మర్యాదగా ‘అరెస్టు చేస్తున్నాం సార్’ అని చెప్పి తీసుకెళ్లేవారని, ఎందుకో ఈసారి మాత్రం తమ ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేసారని అన్నారు. ఇరవై మంది పోలీసులు, సుమారు ఎనిమిది గంటలపాటు సోదాలు నిర్వహించారని, ఇల్లంతా చిందర వందర చేశారని తమ ఫోన్లు కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లారని చెప్పారు. అయితే వరవరరావు ఫోన్ తో పాటు తన ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారని, తమ ఆధార్ కార్డులను కూడా వారివెంట తీసుకెళ్లారని చెప్పారు. అయితే తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను పోలీసులు తనకు అందజేశారని, సుమారు ఎనిమిది గంటలకు పైగా తనిఖీలు చేసిన పోలీసులు ఏమీ తినకుండా ఉండడంతో, తానే టీ చేసి ఇచ్చినట్టు హేమలత మీడియాకి తెలియచేశారు.