ఆస్ట్రేలియా గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఈరోజు 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విరాట్ కోహ్లీ ఒక ఏడాదిలో విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2002లో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 1,137 పరుగులతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పగా తాజాగా విరాట్ కోహ్లీ 1,138 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అయితే ద్రవిడ్ అప్పట్లో కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా కోహ్లీ మాత్రం 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్‌ని చేరుకున్నడు. 2002లో 66.88 సగటుతో ఏకంగా 4 శతకాలు, 4 అర్ధశతకాలతో మెరిశాడు. ఆ ఏడాది విదేశాల్లో 11 టెస్టులాడిన ద్రవిడ్ 18 ఇన్నింగ్స్‌ల్లో 1,137 పరుగులు చేశాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో శతకాల మోత మోగించిన విరాట్ కోహ్లీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తున్నాడు.