Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టెస్ట్ సిరీస్ పరాజయానికి ఘనమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటూ డర్బన్ వన్డేలో భారత్ సాధించిన చిరస్మరణీయ విజయంపై అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డర్బన్ ఇన్నింగ్స్ ద్వారా తాను ఎంత విలువైన ఆటగాడో మరోసారి చాటిచెప్పాడు విరాట్. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ కొన్ని రికార్డులూ తన పేర నమోదుచేసుకున్నాడు. డర్బన్ లో కోహ్లీ చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్ లో 33వది కాగా కెప్టెన్ గా 11వది. ఈ సెంచరీ ద్వారా విరాట్ గంగూలీ రికార్డును సమానం చేశాడు.
గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో 11 సెంచరీలు చేశాడు. అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ సారధిగా ఎవరూ అన్ని సెంచరీలు చేయలేదు. ఇప్పుడు కోహ్లీ 11వ సెంచరీ చేసి గంగూలీ సరసన నిలిచాడు. అయితే 11 సెంచరీలు చేయడానికి గంగూలీకి 142 ఇన్నింగ్స్ పట్టగా…కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్ లోనే ఆ ఘనత సాధించాడు. ఇక ఎప్పటిలానే డర్బన్ వన్డేలోనూ ఛేజింగ్ లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఛేజ్ మాస్టర్. ముచ్చటైన డ్రైవ్ లు, ఫ్లిక్స్, కట్ షాట్లతో మైదానం అన్నివైపులా కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు.
విరాట్ చేసిన 33 సెంచరీల్లో 20 ఛేజింగ్ లో సాధించినవే. అటు కోహ్లీ ఇన్నింగ్స్ పై ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛేజ్ మాస్టర్ మరోసారి తన సత్తా చాటాడని, కోహ్లీ గ్రేటెస్ట్ ఛేజర్ అని ప్రశంసిస్తున్నారు. విరాట్ కోహ్లీ… వాట్ ఏ ఛేజర్… అద్భుతమైన ఆటగాడు… కోహ్లీ ఇప్పటివరకు ఆడిన అన్ని దేశాల్లో శతకం సాధించాడు. డర్బన్ లో కోహ్లీ శతకం వల్ల విజయం ఎంతో సులువుగా భారత్ సొంతమయింది అని వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.మోడ్రన్ మాస్టర్ నుంచి 33వ శతకమని, ప్రపంచంలో ఎక్కడైనా ఛేజింగ్ కింగ్ కోహ్లీనే అని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. వన్డే కెరీర్ లో 33వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి అభినందనలని ఐసీసీ ట్వీట్ చేసింది.