Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత భారత జట్టుపై విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే రకం అభిప్రాయం వ్యక్తంచేశాడు. కెప్టెన్ గా కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలను జట్టులో ఎవరూ సవాల్ చేయకపోవడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. మైదానంలో కెప్టెన్ చేసే తప్పులను సహచరులు ఎత్తిచూపినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన విశ్లేషించాడు. తాను చేసే తప్పులను వెతికే ఆటగాళ్లు ఇప్పుడు కోహ్లీకి కావాలని, ప్రతి జట్టులోనూ ఇలాంటి ఆటగాళ్లు నలుగురైదుగురు ఉంటారని సెహ్వాగ్ తెలిపాడు.
జట్టులోని ఇతర ఆటగాళ్లు కెప్టెన్ తప్పుచేయకుండా చూస్తారని, భారత జట్టులో అలాంటి ఆటగాళ్లు లేకపోవడం ప్రతికూలంగా మారిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ సెలక్షన్ నిర్ణయాలను డ్రెస్సింగ్ రూంలో ఎవ్వరూ సవాల్ చేయకపోవడం మంచి పరిణామం కాదన్నాడు. అదే సమయంలో కోహ్లీ సహచర ఆటగాళ్లపై విపరీత అంచనాలు పెట్టుకుంటున్నాడని, ఇవి కూడా ఆయన కెప్టెన్సీపై ప్రభావం చూపిస్తోందని వీరూ విమర్శించాడు.
క్లిష్టపరిస్థితుల్లో కూడా అద్భుతంగా ఆడే స్థాయికి విరాట్ చేరుకున్నాడని, జట్టులో ఇతర ఆటగాళ్లు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని, ఆ విషయాన్ని విరాట్ గుర్తెరగాలని సెహ్వాగ్ సూచించాడు. తనలానే ఇతర ఆటగాళ్లు కూడా ధైర్యంగా ఆడాలని కోహ్లీ కోరుకోవడంలో తప్పులేదని, సచిన్ కూడా తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇలానే అనుకునేవాడని, తాను ఆడుతున్నప్పుడు మిగతావారు ఎందుకు ఆడడం లేదని ప్రశ్నించేవాడని సెహ్వాగ్ గుర్తుచేశాడు. క్రికెట్ సమిష్టి ఆటని, ఏ ఒక్క ఆటగాడి వల్లా విజయం రాదని, ప్రతి ఒక్క ఆటగాడూ తన వంతు పాత్ర పోషించాలని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.