Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ క్రికెట్ కు, ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన తరువాత బ్యాటుకు సెలవిచ్చి…ట్విట్టర్ ను దున్నేస్తున్నాడు..భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ . సచిన్ స్థాయిని అందుకోకపోయినా…భారత క్రికెట్లో రెండో సచిన్ గా పేరు తెచ్చుకున్న సెహ్వాగ్ దూకుడైన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఒక దశలో సెహ్వాగ్ లేని భారత క్రికెట్ టీం ను ఊహించటం సగటు క్రికెట్ అభిమానికి ఎంతో కష్టమయింది. తన కెరీర్ లో వన్డేల్లో డబుల్ సెంచరీ సహా ఎన్నో ఎత్తులను అధిరోహించిన సెహ్వాగ్…వన్డేల నుంచి నిష్క్రమించిన తరువాత…ఐపీఎల్ లో కొన్నాళ్లు ఆడుతూ అభిమానుల్ని అలరించాడు. తరువాత దానికీ వీడ్కోలు చెప్పారు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా ఉన్న సెహ్వాగ్ చాన్నాళ్ల తరువాత మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ 10 లీగ్ లో సెహ్వాగ్ ఆడనున్నాడు. వన్డే క్రికెట్ కు టీ 20 పొట్టి ఫార్మాట్ అయితే టీ 20కి టీ 10 మరింత పొట్టి ఫార్మాట్ అన్నమాట. టీ 20 క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవటంతో…దాన్ని మరింతగా కుదించి టీ 10 ఫార్మాట్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు 90 నిమిషాల సమయం కేటాయించనున్నారు. ఐపీఎల్ లానే…టీ 10 ఫార్మాట్ లో ఆయా నగరాలు, దేశాలకు తగ్గట్టుగా పేర్లు కేటాయించారు. పంజాబీస్, మరాఠీస్, బంగ్లాస్, లంకన్స్ సింథీస్, కేరళిటిస్, ఫఖ్తూన్స్ పేర్లను ఖరారు చేశారు. ఫఖ్తూన్స్ జట్టుకు పాకిస్థాన్ క్రికెటర్ ఆఫ్రిది నాయకత్వం వహించనున్నారు. యూఏఈలోని షార్జా క్రికెట్ మైదానంలో డిసెంబరు 21 నుంచి 24 వరకు ఈ టోర్నీ జరగనుంది. దక్షిణాసియా నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు సెలబ్రిటీలు టీ 10 టోర్నీకి హాజరు కానున్నారు. ఈ టోర్నీద్వారా క్రికెట్ అభిమానులకు మరోసారి సెహ్వాగ్ దూకుడైన బ్యాటింగ్ చూసే అవకాశం లభిస్తోంది.
మరిన్ని వార్తలు: