Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో బౌండరీలతో చెలరేగే సమయంలోనే కాదు… క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా…ప్రేక్షకులకు ఆయనపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. ఆయన్ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఏ చిన్న అవకాశం లభించినా ఆయన దగ్గరకు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఇందుకు మొహాలీలో సెహ్వాగ్ కు ఎదురైన అనుభవమే ఉదాహరణ. ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు సెహ్వాగ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.
జట్టు సభ్యులు మొహాలిలో ప్రాక్టీస్ చేస్తుండగా… వారిని పర్యవేక్షిస్తూ సెహ్వాగ్ అక్కడ ఉన్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు సెహ్వాగ్ వద్దకు వచ్చాడు. సెహ్వాగ్ తో తాను మీ వీరాభిమానినని చెప్పాడు. తన పేరు ఓం ప్రకాశ్ అని, పాటియాలా నుంచి వచ్చానని తెలిపాడు. 93 ఏళ్ల వయసులో సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించి తనను చూసేందుకు వచ్చిన ఆ వృద్ధుడి అభిమానం చూసి సెహ్వాగ్ చలించిపోయాడు. ఆ వృద్ధునికి పాదాభివందనం చేసి తన కృతజ్ఞత తెలియజేశాడు. సెహ్వాగ్ ఓం ప్రకాశ్ పాదాలకు నమస్కరిస్తున్న ఫొటోలను కింగ్స్ ఎలెన్ పంజాబ్ నిర్వాహకులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పెద్ద అభిమానితో దిగిన సెల్ఫీని సెహ్వాగ్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఓం ప్రకాశ్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. 93ఏళ్ల వయసులో నాకోసం పాటియాలా నుంచి వచ్చారు. నా పై ఎంతో ప్రేమ కురిపించారు. దాదాకో ప్రణామ్ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. అభిమానానికి పాదాభివందం చేసిన సెహ్వాగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెటర్ గా విశేష పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్…రిటైర్మెంట్ తర్వాత ఇతర క్రికెటర్లలా కాకుండా..సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రజలకు దగ్గరయ్యాడు. సమకాలీన పరిస్థితులపై సెటైర్ల రూపంలో సెహ్వాగ్ చెప్పే అభిప్రాయాల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.