Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే తన 100, 101వ చిత్రాలు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరియు ‘పైసా వసూల్’లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బాలయ్య 102వ చిత్రాన్ని తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో అంచనాలున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్‌గా శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
‘యుద్దం శరణం’ చిత్రంలో విలన్‌గా శ్రీకాంత్ మెప్పించలేక పోయాడు, ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు బాలయ్య 102వ చిత్రంలో విలన్ పాత్రకు మరో నటుడిని తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్‌తో దర్శకుడు రవికుమార్ చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో స్టార్ అయిన వివేక్ ఒబెరాయ్ తెలుగు మరియు తమిళంలో కూడా గతంలో నటించాడు. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిటాల రవిగా వివేక్ ఒబెరాయ్ సుపరిచితుడు. తాజాగా తమిళ ‘వివేగం’ చిత్రంలో కూడా విలన్‌గా వివేక్ నటించాడు. విలన్ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించే వివేక్ తాజాగా బాలయ్య కోసం ఓకే చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలు నిజం అయితే బాలయ్య తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ ఉంటే ఫోకస్ అంతా కూడా వివేక్ ఒబెరాయ్‌పై పడే అవకాశం ఉందని, బాయ్య సినిమా కాస్త వివేక్ సినిమా అయ్యే ప్రమాదం ఉందని, బాలయ్య స్టార్ ఇమేజ్‌ను మించిన వారితో ఢీ కొట్టడం ఎంత మాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సి కళ్యాణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. బాలయ్యతో నయనతార ఈ చిత్రంలో మూడవసారి నటిస్తుంది.