ప్రచారం జరుగుతున్నట్టుగానే మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టీ-బీజేపీ నేత లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని వివేక్ ఓ పోస్ట్ లో పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అమర వీరులకు నా నమస్సుమాంజలి.
తెలంగాణాలో రాజకీయ అస్థిరత్వంతో పాటు నియంతృత్వ పోకడలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి,కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పని చేయాలి కానీ, నిరంకుశంగా వారి గొంతులని అణగ తొక్కాలని చూస్తోంది. అదేవిధంగా తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది.
తెలంగాణాలో అభివృద్ధి అనేది కొందరి కుటుంబాలకి మాత్రమే పరిమితమైంది. ప్రజలకు మాత్రం ప్రభుత్వ పథకాలు నీటి మీద రాతలుగా మిగిలాయి. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని, ప్రాణాలు సైతం వదిలిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం పక్కన పెట్టింది.
మాటల గారడితో, ప్రచారాలతో ప్రజల మెప్పు పొందటం ప్రతీసారి సాధ్యం కాదు. మార్పు అనేది రావాలి, నిజమైన తెలంగాణ ప్రజావాణి వినిపించాలి. బంగారు తెలంగాణ అనేది మాటలలో కాదు, చేతలలో చూపించాలి. ఇది కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను..’అని పేర్కొన్నారు.