వివేకా హత్య కేసు…అతని మీదే అనుమానం !

మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని, హత్యకు గురయ్యారని పోస్టుమార్టంలో తేలడంతో రాజకీయ రంగును పులుముకుంది. దీనిపై అధికార టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలు, లేదు జగన్ కుటుంబంలో నెలకొన్న విభేదాలే వివేకా హత్య దారి తీశాయని టీడీపీ ఆరోపిస్తోంది. తొలుత గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం జరిగినా తర్వాత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండటం, శరీరంపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం చేయడానికి ముందే అంచనా వేశారు. పోస్టుమార్టం ప్రాధమిక నివేదికలో కూడా అదే తేలింది. దీంతో కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, వివేకానందరెడ్డిని హత్యచేసిందెవరనే అంశంపై ఆయన కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ తండ్రి రాజా రెడ్డిని చంపిన కేసులో నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై సందేహం వ్యక్తమవుతోంది. గతంలో చేసిన నేరాలకు కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన కారణంగా మూడు నెలల కిందట విడుదల చేశారు. అతడే వివేకాను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాదు, హత్య జరగడానికి ముందు వివేకా నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టు భావిస్తున్నారు. వివేకానందరెడ్డి ఇంటి సమీపంలో ఉండే ఓ కుక్కను కూడా కొద్ది రోజుల కిందట చంపేసినట్టు అనుమానిస్తున్నారు.
అంతిమ కార్యాలు :
మరోవైపు, వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 10.30 గంటలకు జరగునున్నాయి. తండ్రి వైఎస్ రాజారెడ్డి సమాధి వద్దే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయనను కడసారి చేసేందుకు వైసీపీ అభిమానులు, నేతలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.