ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సమయంలో కొందరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అదేమంటే… ఈ సమయంలో ప్రజలకు ఏదైతే ఇష్టమో అది తెలుసుకొని తమకు అనుకూలంగా మలుచుకుంటూ సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో నాటుసారాకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకొనేందుకు ఏకంగా ఇళ్లలోనే దుకాణం పెట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.
తాజాగా తిరుపతిలో ఇదే ఘటన చోటుచేసుకుంది. జనావాసాల మధ్యే ఓ ఇంట్లో నాలుగు బట్టీలు, మూడు వేల లీటర్ల సారా ఊటను చూసి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు షాక్ తిన్నారు. సారా బట్టీలు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు జరిపిన పోలీసులు.. ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో నాలుగు బట్టీలు పెట్టి సారా తయారీ చేయడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. ఏకంగా 14 డ్రమ్ముల్లో మూడువేల లీటర్ల సారా ఊటను గుర్తించి.. పూర్తిగా అధికారులు ధ్వంసం చేశారు.
అంతేకాకుండా ఈ సారా కేసులో ఆటో డ్రైవర్ శ్రీనివాసులు అనే వ్యక్తితో పాటూ అతడి కుమారుడు, అల్లుడ్ని అరెస్ట్ చేశారు. అలాగే… నిందితుడి కుమారుడు, కుమార్తె వార్డు వాలంటీర్లుగా కూడా గుర్తించారు. తిరుపతి జీవకోన పార్వతీపురంలో సారా అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ నలుగురు శ్రీనివాసులు, కుమారుడు వాసు, అల్లుడు కేశవులు, భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా సారా తయారు చేసి వాలంటీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు కుమారుడు వాసు సారాను బాటిల్స్‌లో పోసి హోం డెలివరీ చేస్తున్నట్లు కూడా వారు గుర్తించారు.
కాగా నిందితుడు శ్రీనివాసులది పీలేరు మండలం బోడేవాండ్లపల్లె.. కానీ కొన్నేళ్ల కిందట జీవకోనకొచ్చి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. గత మూడు నెలలుగా ఇంట్లో సారా కాస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇంట్లోనే సారా కాయడం.. అది తిరుపతిలో సంచలనం సృష్టిస్తోంది.