రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో వీఆర్వోలే కీలకంగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం 7039 పోస్టులు ఉండగా 5088 మంది వీఆర్వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. భూదస్త్రాల నిర్వహణలో వీరు సహాయకారులుగా ఉంటున్నారు. వీఆర్వోపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నాయబ్ తహసీల్దారు(డీటీ), ఆపై తహసీల్దారు వ్యవస్థ ఉంటుంది. ప్రజలతో నేరుగా సంబంధాలున్న వీఆర్వోలు అవినీతికి కారణమవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.నిఘా సంస్థల నుంచి తెప్పించుకున్న సమాచారంలోనూ ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా పలుమార్లు వీఆర్వోల పనితీరును ఎండగట్టారు. భూమి శిస్తు వసూళ్లు, నీటి తీరువాలను ప్రభుత్వం రద్దు చేయడంతో వారి విధుల్లో ప్రధానమైనవి తొలగినట్లయ్యాయి. దీంతో ఈ వ్యవస్థను వేరేశాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ప్రభుత్వంలో కీలకమైన అధికారుల వద్ద వీఆర్వో వ్యవస్థపైనే చర్చ జరిగినట్లు తెలిసింది.కొత్త చట్టం నేపథ్యంలో రెవెన్యూ కోడ్ కన్నా ధరణి ఆన్‌లైన్ పోర్టల్ వేదికగా మాభూమి లేదా ఇతర పేర్లతో కొత్తచట్టాన్ని అమలు చేసి సేవలను సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో భూదస్త్రాలను నిక్షిప్తం చేసే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.