బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు , గాయకుడు వాజీద్ ఖాన్ (42) అనారోగ్య సమస్యలతో ముంబైలోని చెంటూర్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడతున్న ఆయనకు ఇటీవలె కరోనా సోకింది. వాజీద్ తల్లి రజినాకు కూడా కోవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే వాజీద్ కంటే ముందే ఆమెకు వైరస్ సోకిందని పేర్కొన్న వైద్యులు..కొడుకు అనారోగ్యం కారణంగా అతన్ని చూసుకోవడానికి ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెకు కరోనా నిర్ధారణ కాగా, తల్లి నుంచి వాజీద్‌కు కూడా వైరస్ సోకిందేమో అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ఇక వాజీద్ ఖాన్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, సన్నిహితులతో సహా 20 మందిని మాత్రమే అనుమతించారు. వాజీద్ మృతి పట్ల అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ప్యార్ కియాతో డర్నా క్యా చిత్రంతో ఇండస్ర్టీకి పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి పనిచేస్తూ వచ్చారు. లాక్‌డౌన్ సమయంలోనూ హీరో సల్మాన్ ఖాన్ భాయ్ భాయ్ పాటకు సంగీతం అందించారు. నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవు. ఎప్పటికీ గుర్తిండిపోతావ్ నీ ప్రతిభను మిస్సవుతాను అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు.