Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ అసెంబ్లీ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు విమర్శల దాడిచేసుకుంటున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించడానికి టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అసెంబ్లీలో జరిగిందంతా డ్రామానేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె. అరుణ ఆరోపించారు. గత నాలుగేళ్లలో అసెంబ్లీలో జరిగిన నిరసనలను ఎప్పుడూ మీడియాకు ప్రత్యక్షప్రసారం చేయని టీఆర్ఎస్ ఓ పథకం ప్రకారం మొత్తం లైవ్ దృశ్యాలను ప్రసారం చేసిందని, ఆపై మీడియాకు ఫుటేజ్ ఇచ్చిందని, ఇదంతా టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనని డీకె అరుణ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము భయపడబోమని, ప్రజల్లోకి వెళ్లి నిజానిజాలు వెల్లడిస్తామని చెప్పారు. స్వామిగౌడ్ గాయం వెనక పొలిటికల్ డ్రామా ఉందా అన్న విషయాన్ని తెలుసుకుంటామన్నారు. ఈ ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపితే ఆ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తామని ఎల్పీ భేటీలో కేసీఆర్ ఎలా చెబుతారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
అటు ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరించారని రౌడీలు, గూండాల్లా ప్రవర్తించారని, అసెంబ్లీలో మైకును పట్టుకుని తిప్పి తిప్పి విసిరేశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది, అన్నింటికంటే ముఖ్యమైనది శాసససభని, అటువంటి సభలో ఇలా ప్రవర్తించవచ్చా… అని ప్రశ్నించారు. సభలో జరిగే వ్యవహారాలను పిల్లలు, విద్యార్థులు కూడా చూస్తున్నారని, ఇక్కడకు చట్టాలు చేయడానికి వచ్చామా… వీధి రౌడీల్లా గొడవపడడానికి వచ్చామా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ఫస్ట్రేషన్ కనపడుతోందని, ప్రతిపక్షం `తరపున గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే సమయంలో మాటల రూపంలో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉన్నప్పటికీ భౌతికంగా దాడులకు దిగారని ఆరోపించారు. ఎంతో ఘన చరిత్ర ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటూ ఉంటుందని, ఇదేనా చరిత్రని హరీష్ రావు మండిపడ్డారు. స్వామిగౌడ్ పై కోమటిరెడ్డి దాడిచేయడం దుర్మార్గపు చర్యని, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గూండాల్లా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న పథకాలను చూసి కాంగ్రెస్ సభ్యులు ఓర్వలేకపోతున్నారని తలసాని విమర్శించారు.