జల దిగ్బంధంలో ముంబై

జల దిగ్బంధంలో ముంబై

ముంబయి మహా నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలో రానున్న మూడు రోజులపాటు భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మూడు రోజుల పాటు స్కూళ్లకి సెలవులు ప్రకటించారు.

ఆయా పాఠశాలల యాజమాన్యాలు  పిల్లల్ని వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. రహదారులపై మోకాలి లోతు వరకు వరద నీరు చేరడంతో నగర  వాసులు బయటకు రావాలంటేనే అవస్థలు పడుతున్నారు. ఇక ట్రైన్‌లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలో 24గంటల  పాటు రెడ్‌ అలర్డ్‌ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆయా ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయే అవకాశాలున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. నీరు నిలిచే ప్రాంతాల వద్దకు, సముద్ర తీర ప్రాంతాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.