ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తమపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఏఎఫ్టీయూ, అంగన్వాడీ సంఘాలు నిర్ణయించాయి. సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి.
మరోవైపు అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పట్ల కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారి ప్రధాన సంఘాలతో చర్చలు జరిపి.. వేతనాలు పెంచేదేలేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలిసింది.