వాట్ ఎన్ ఐడియా! ఐబీఏ నయా ప్లాన్ అదుర్స్…..

కరోనా మహమ్మారి జనాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాపిస్తోంది. తాజాగా బ్యాంకులకు, ఏటీఎం సెంటర్స్‌కు కస్టమర్ల రాకను తగ్గించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) క్యాష్ ను తీసుకొనే విషయంలో కొత్త నియమాలను తెచ్చింది. వీటి ద్వారా ఎలక్ట్రానిక్ వినియోగం పెంచడంతో పాటు బ్యాంకులకు, ఏటీఎం సెంటర్స్‌కు ఎక్కువ మంది రావడం తగ్గుతుందని భావించింది. బ్రాంచీల వద్ద క్రౌడ్‌ను నిరోధించేందుకు నగదు ఉపసంహరణ కోసం నిర్దిష్టమైన తేదీలను కేటాయించింది.

అయితే కొద్దిగా సరి బేస్ విధానంలా.. నగదు ఉపసంహరణ కోసం బ్యాంకు కస్టమర్ అకౌంట్ నెంబర్‌లోని చివరి నెంబర్ ఆధారంగా తేదీలను కేటాయించారు. అంటే.. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం తగ్గించేందుకు సరి – బేసి విధానం తీసుకు వచ్చినట్లుగా ఉంటుందన్న మాట. ఈ విధానం ద్వారా బ్యాంకుల బయట ఎక్కువ మంది గుమిగూడటం తగ్గించవచ్చని తెలుస్తోంది. పూర్తిగా సరిబేసి విధానం కాదు.. కానీ 0 నుండి 9 వరకు ఒక్కో తేదీని కేటాయిస్తారు.

అది ఎలా అంటే.. బ్యాంకు అకౌంట్ నెంబర్ చివరలో 0, 1 ఉంటే వారికి మే 5వ తేదీన నగదు తీసుకొనే వెసలుబాటు ఇస్తారు. ఇలా అకౌంట్ నెంబర్ చివరలో 2, 3 ఉంటే మే 5న, అకౌంట్ నెంబర్ చివరలో 4, 5 ఉంటే మే 6న నగదును తీసుకోవచ్చు. అకౌంట్ నెంబర్ చివరలో 6, 7 ఉంటే మే 8న, అకౌంట్ నెంబర్ చివరలో 8, 9 ఉంటే మే 11న నగదును తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాగా నెల మొదట్లో వేతనం వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది వస్తారు. దీంతో ఈ మే 11వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది.

ఆ తర్వాత నుండి ఈ పరిమితులు ఎత్తివేయడం జరుగుతుంది. బ్యాంకులవద్ద పెద్ద ఎత్తున కస్టమర్లు గుమికూడుతుండటంతో IBA ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో సామాజిక దూరం పాటించినట్లు కూడా అవుతుంది. కాగా ఈ కరోనా గడ్డుకాలంలో ఏ బ్యాంకు ఏటీఎం నుండి తీసుకున్నా చార్జీలు పడవు. ఈ మేరకు IBA ప్రకటన ద్వారా తెలిపింది. ఇదిలా ఉండగా.. గరీబ్ కళ్యాణ్ యోజన కింద జన్ ధన్ అకౌంట్ కలిగిన మహిళల ఖాతాల్లో రూ.500 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వీటిని తీసుకోవడానికి తొందర పడవద్దని.. ఈ అకౌంట్లలో పడిన డబ్బులు సురక్షితంగానే ఉంటాయని IBA స్పష్టం చేసింది.