Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి వివాదాస్పదమరణంపై వెల్లువెత్తుతున్న మీడియా కథనాలు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. గుండెపోటుతో కుప్పకూలి ఆమె మరణించారని కుటుంబ సభ్యులు చెప్పగా… ఫోరెన్సిక నివేదిక ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి చనిపోయారని వెల్లడించడం సంచలనంగా మారింది. శ్రీదేవి భౌతికకాయం అప్పగింతలో అయిన ఆలస్యంతో మొదలయిన అనుమానాలు… డెత్ సర్టిఫికెట్ జారీ తర్వాత తీవ్రరూపుదాల్చాయి. ఇక అప్పటినుంచి మీడియాలో వరుస కథనాలు హోరెత్తుతున్నాయి. శ్రీదేవి ఎలా చనిపోయారు. ప్రమాదమా… లేక మరేమన్నా జరిగిందా… కుట్ర కోణం ఉందా… వంటి కోణాల్లో ప్రసారమవుతున్న కథనాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. శ్రీదేవి బాత్ టబ్ లో అచేతనంగా పడిఉండడాన్ని మొదటగా చూసిన ఆమె భర్త బోనీకపూర్ ను దుబాయ్ పోలీసులు గంటలు తరబడి విచారించారని సోమవారం సాయంత్రం నుంచి భారత మీడియాలో కథనాలు రాగా… అసలు బోనీని ఇంటరాగేషనే చెయ్యలేదని గల్ఫ్ మీడియా చెప్పడం మరింత గందరగోళానికి దారితీసింది.
నిజానికి ఈ కేసులో అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే… గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా… అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఒక కేసు విచారణలో ఆఖరికి దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకునే ఆస్కారం లేదు. అంత కఠినం అక్కడి చట్టాలు. అక్కడి నుంచి కచ్చితమైన సమాచారమేదీ రాకపోవడంతో అనేక రకాల ఊహాగానాలు, విరుద్ధ కథనాలు విస్తృతంగా ప్రచారంలోకివస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహం తరలింపు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లో యాక్సిడెంటల్ డ్రౌనింగ్ వల్లే శ్రీదేవి చనిపోయిందని నిర్ధారించారు. అయితే ఆ యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులను మాత్రం పేర్కొనలేదు. పూర్తిస్థాయి రిపోర్టులు వచ్చిన తర్వాతే అందుకు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేసు దుబాయ్ పోలీసుల నుంచి ప్రాసిక్యూషన్ కు బదిలీ అయింది. పోలీసుల విచారణ, వైద్యుల రిపోర్టులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్ నయీబ్ అసంతృప్తి వ్యక్తంచేశారని, రీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారని కొన్ని కథనాలు వస్తున్నాయి. రీ ఇన్వెస్టిగేషన్ వార్త నిజమైతే… మృతదేహం తరలింపు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా ఇవాళ కూడా శ్రీదేవి భౌతిక కాయం స్వదేశానికి చేరే అవకాశం లేదు.