తుమ్మును బలవంతంగా ఆపుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

what happens if you forcibly stop Sneezing

100mph అంటే సుమారు గంటకు వంద మైళ్ల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. లండన్లోని 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపేందుకు ముక్కు, రంధ్రాలు నోరు ఒకేసారి మూశాడు. దీంతో అతడి గొంతు మధ్య అంతర్గతంగా రంధ్రమైంది. ఆ తర్వాత అతని స్వరం మారిపోయింది. గొంతు బాగా వాచి నొప్పి వస్తుండంతో బాధితుడు వైద్యులను సంప్రదించాడు. సీటీ స్కాన్ లో అతని గొంతు లోపలి భాగం చిధ్రమైనట్లు గుర్తించారు. గాలి బుడగలు గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయి. దీనివల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి వెంటనే అతనికి చికిత్స అందించారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అతను కోలుకున్నాడు.

దీని గురించి ప్రత్యేకంగా పరిశీలిస్తే తుమ్ము వల్ల చాలా శక్తివంతమైన గాలి శరీరం నుంచి ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే.. అది శరీరంలోని అంతర్గత భాగాలపై ప్రతి చర్య చూపెడుతుంది. తుమ్ములోని గాలి బుడగలు గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు తెలిపారు. తుమ్మును బలవంతంగా ఆపితే మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీచెస్టర్ కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరించారు. కాబట్టి, ఇకపై ఎప్పుడైనా తుమ్ము వస్తే బలవంతంగా ఆపే ప్రయత్నం చేయొద్దు. తుమ్ములు ఎక్కువగా వస్తుంటే రుమాలు ఉపయోగించండి. అయితే, ముక్కు, నోటిని బలంగా మూసే ప్రయత్నం చేయొద్దు.