ఏం చేద్దాం..? సీఎంలతో పీఎం వీడియో కాన్ఫెరెన్స్ పై ఉత్కంఠ.. !

కేంద్రం విధించిన మలిదశ లాక్ డౌన్ రోజులు కూడా సమీపిస్తున్నాయి. మే3తో లాక్ డౌన్ ముగియనుంది. కానీ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి దశలో ఏం చేయాలి అనే మీమాంసలో పడింది కేంద్రం. కాగా మరో వారం రోజుల్లో లాక్ డౌన్ 2.0 ముగుస్తుంది. కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ ను పకడ్బంధీగా అమలు చేస్తే.. కరోనాను తరిమికొట్టవచ్చని భావించిన కేంద్రం మొదట 21 రోజులు, ఆ తర్వాత 19 రోజుల లాక్ డౌన్ ను విధించింది. అయితే ఆ గడువు మే 3తో ముగియనున్న ఈతరుణంలో తర్వాతి కార్యాచరణ ఎలా తీసుకుందాం అనేదానిపై తీవ్రంగా చర్చలు జరుపుతుంది కేంద్రం. మలిదశలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు కీలకంగా ముఖ్యమంత్రులతో జరిపే వీడియో కాన్ఫెరెన్స్ తర్వాత నిర్ణయం తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అంతేకాకుండా ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ప్రారంభం కానుంది.య మోడీ అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడతారు. అసలు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన సమయంలో ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం అయిన వేళ.. దాన్ని తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్న అంశంపై కూడా కొన్ని కీలక నిర్ణయాలను ఈ దఫా మోడీ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని కూడా కాస్త సమాచారం అందుతుంది.

అంతేకాకుండా ఇదే తరుణంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి.. ప్రజా రవాణాను తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కూడా మోడీ వారికి తగిన వెసులుబాటును కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని పీఎంఓ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ విషయంలో సీఎంల సలహాలను మొదట అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మోడీ.. ఆపై మొత్తం పరిస్థితిని సమీక్షించి.. లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అన్న విషయంపై ఓ నిర్ణయానికి.. స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా సీఎంలతో మోడీ వీడియో కాన్ఫెరెన్స్ పై ప్రజల్లో అయితే ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. చూద్దాం ఏం జరుగుతుందో.