ఏపీ టీడీపీ నేతలు ప్రతీదానికి దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి గత 4 రోజులుగా 4-5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రకాశం బ్యారేజీకి మరింత ఎక్కువ వరద వచ్చే అవకాశముందని చెప్పారు.
గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా విజువల్స్ తీయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడెక్కడ వరద ముంపు వస్తుంది. ఎంత నష్టం జరుగుతుంది? అనే కోణంలో అంచనాల కోసం విజువల్స్ తీయించామని చెప్పారు.
చంద్రబాబు ఉంటున్న నివాసం కరకట్ట మీద అక్రమంగా నిర్మించినదేనని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు తన ఇంట్లోకి నీళ్లు రాకుండా చంద్రబాబు ఇసుక బస్తాలు వేయిస్తున్నారనీ, అది కూడా చట్ట వ్యతిరేకమేనని మంత్రి తెలిపారు.
ఉండవల్లిలోని నివాసం తనది కాదని ఒకరోజు మాట్లాడే చంద్రబాబు, మరోరోజు తన ఇంటి జోలికి వస్తున్నారంటూ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అనుమతి, ఆదేశాలతోనే డ్రోన్ల ద్వారా ఫొటోలు తీస్తున్నారని తేల్చిచెప్పారు.
అయితే ఆ డ్రోన్ లను ప్రయోగించిన వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు నిర్భందించగా తాము జగన్ ఇంట్లో ఉండే కిరణ్ అనే వ్యక్తి తీయమంటే ఈ విజుయల్స్ తీశామని చెప్పడం గమనార్హం.
ReplyForward
|