Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుధాకర్ రెడ్డి హత్య కేసులో మరో విషాద కోణం వెలుగుచూసింది. భార్య స్వాతి… ప్రియుడు రాజేశ్ తో కలిసి సుధాకర్ రెడ్డిని హత్య చేసిన తర్వాతి రోజే వారి కుమారుడు దర్శిత్ రెడ్డి ఏడో పుట్టినరోజు. ఆ రాత్రే రాజేశ్ తో కలిసి స్వాతి భర్తను హతమార్చింది. సుధాకర్ రెడ్డి హత్య, యాసిడ్ దాడి నాటకం తర్వాత భవిష్యత్ లో ఏం చేయాలన్నదానిపైనా స్వాతి, రాజేశ్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. అసలు ముఖంపై పెట్రోల్ పోసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా…పెద్ద గాయాలేవీ కాకుండే ఉండేలా చూసుకున్నారు. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే స్థాయిలో మాత్రమే కాల్చుకోవాలని ముందుగానే వారు అనుకున్నారు. ఇందుకోసం ముఖానికి క్రీం పూసుకున్నాడు రాజేశ్. నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఓ వస్త్రంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటతో క్రీం రాసుకున్న చోట మాత్రమే కాల్చుకున్నాడు. దీంతో ఆయన ముఖంపై చర్మం స్వల్పంగా మాత్రమే కాలినట్టు తెలుస్తోంది.
ఆస్పత్రిలో వైద్యం, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత స్వాతి, రాజేశ్ ముంబై లేదా పూణె వెళ్లిపోవాలని పథకం వేసుకున్నారు. కానీ అంతలోనే వారి నాటకం బెడిసికొట్టింది. తొలుత అనుమానించకపోయినప్పటికీ ఆస్పత్రిలో రాజేశ్ వ్యవహార శైలి చూసిన తర్వాత సుధాకర్ రెడ్డి తల్లి సుమతమ్మ, అన్న సురేందర్ రెడ్డికి ఆరోరోజు అనుమానమొచ్చింది. సుధాకర్ రెడ్డి కాలిగోళ్లు చిట్లినట్టు ఉంటాయి. అలాగే అతనికి ఛాతీపై వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. ఆస్పత్రి బెడ్ పై ఉన్న వ్యక్తికి ఈ ఆనవాళ్లు లేవు. దీనికితోడు కాలిన గాయాలకు చికిత్స పొందే రోగులకు ఇచ్చే మటన్ సూప్ ను తాగడానికి రాజేశ్ నిరాకరించడం, పరామర్శిండానికి వచ్చిన వారితో మాట్లాడకుండా ఎవాయిడ్ చేయడం…ఐసీయూను చీకటిగా ఉంచాలనడం వంటివి వారికి అనుమానం తెప్పించాయి. దీంతో నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
విచారణలో స్వాతి దారుణ పథకం వెలుగుచూసింది. అటు ఈ కేసులో రాజేశ్ ను అరెస్టు చేయడానికి పోలీసులకో సమస్య వచ్చి పడింది. ఆస్పత్రిలో ఉన్నది తమ కొడుకే అనుకుని తొలుత కొంత బిల్లు…సుధాకర్ కుటుంబం చెల్లించింది. ఎప్పుడైతే అతను సుధాకర్ కాదని తెలిసిందో వాళ్లు డబ్బు చెల్లించడం ఆపేశారు. ప్రియురాలి స్వాతి జైలులో ఉంది. దీంతో ఇప్పుడు రాజేశ్ బిల్లు చెల్లించేవాళ్లు ఎవరూ లేరు. రాజేశ్ ను డాక్టర్లు డిశ్చార్జ్ చేసిన తర్వాత అరెస్టు చేద్దామని పోలీసులు సిద్ధంగా ఉండగా… వైద్యులు మాత్రం పెండింగ్ బిల్లు రూ.2లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. ఆ డబ్బులు ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియక నాగర్ కర్నూల్ పోలీసులు సతమతమవుతున్నారు. మరోవైపు తమ కుమార్తె నిర్వాకంపై స్వాతి తండ్రి లింగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అల్లుడి హత్య కలిచివేస్తోందన్నారు. తన కూతురు స్వాతి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదని వాపోయారు. స్వాతి పిల్లల బాధ్యతలు తానే తీసుకుంటానన్నారు. తన దృష్టిలో కూతురు ఇక లేదని, ఆమె చచ్చిందని గుండు గీయించుకుని, కర్మకాండ చేసుకున్నానని లింగారెడ్డి విలపిస్తూ చెప్పారు.