Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ తెలంగాణలో యాత్రను నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత ఆంధ్రాలో కూడా పవన్ యాత్ర చేయబోతున్నాడు. 2019 వరకు పవన్ యాత్రలతో చాలా బిజీగా గడపబోతున్నాడు. రాజకీయాలు అంటే తనకు ప్రాణం అంటూ చెప్పుకొచ్చిన పవన్ ఇకపై సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ ప్రకటించాడు. ఆయన ప్రకటనతో 2019 వరకు పవన్ సినిమాలు చేయడని తేలిపోయింది. 2019 ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తే ఆయన పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్థానంను టాలీవుడ్‌లో ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు ఆ స్థానంకు పోటీ పడుతున్నారు అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ స్థానంను భర్తీ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు, ఏ రంగంలో అయినా ఒకరి స్థానంను మరొకరు భర్తీ చేయడం అనేది జరగదు. ఒకొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్థానంను భర్తీ చేయాలి అంటే అది ఎవరికి సాధ్యం అయ్యే పని కాదు. మీడియా వారు కాస్త అతి చేస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు అందుకు అర్హులు అంటూ ప్రచారం చేస్తున్నారు. వారిద్దరు కూడా గొప్ప నటులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ ఇద్దరు విభిన్న స్టైల్స్ కలిగిన వారు. అందుకే పవర్‌స్టార్ స్థానంను భర్తీ చేయలేరు అనే విషయాన్ని అంతా ఒప్పుకోవాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేసింది తక్కువే అయినా కూడా అశేష అభిమాన గణంను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానులు వీరిద్దరిలో ఒకరిని అభిమానిస్తారని భావించడం కూడా అవివేకం అవుతుంది. రాజరికపు ఆస్థానాలను, సింహాసనాలను వారి వారసులు భర్త చేసే వారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటివి సాధ్యం కాదు. ప్రేక్షకుల నిర్ణయాధికారంపైనే ఒక స్టార్ ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించబడుతుంది.