లగడపాటికి గంటా మీద కోపం ఎందుకు !

Why lagadapati targets on ganta srinivasa

సర్వేల పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం జరుగుతోందంటూ అలకపాన్పు ఎక్కిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును అధిష్ఠానం బుజ్జగించింది. తన నియోజకవర్గమైన భీమిలిలో గంటా పనితీరుపై అసంతృప్తి ఉందంటూ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో నొచ్చుకున్న మంత్రి కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం కలకలం రేపింది. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే ఉద్దేశంతోనే సమావేశానికి హాజరు కాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనుండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలిలో నిర్మించిన సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తిని సీఎం ప్రారంభించనున్నారు. అయితే, రెండు రోజులుగా పార్టీ నేతలతో టచ్‌లో లేకుండా పోయిన గంటా నేటి సీఎం కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

మరోవైపు, సర్వేపై మంత్రి బాధపడుతున్నారని తెలియడంతో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించినట్టు తెలిసింది. సర్వేలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోలేదని, సీఎం పర్యటనలో పాల్గొనాలని కోరారు. అలాగే తాను చేయించాలనుకున్న సర్వేను గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న బీమిలి నియోజకవర్గంలోనే లగడపాటి రాజగోపాల్ చేయించారని చినరాజప్ప చేపుకోచ్చారు. ఈరోజు గంటాను కలిసిన ఆయన సర్వే ఫలితాలు చూసిన గంటా మనస్తాపానికి గురికావడం సహజమేనని ఆ సర్వే ఫలితాలు అలకను తెప్పించేలానే ఉన్నాయని, ఎవరు ఏమి అన్నా, వ్యతిరేకత ఉన్నా వచ్చే ఎన్నికల్లో బీమిలి నుంచి గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి పోటీ పడతారని స్పష్టం చేశారు. అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాసే పోటీలో ఉంటారని చెప్పారు. అన్ని వైపులా నుండి బుజ్జగింపులు స్వయంగా డిప్యూటీ సీఎంనే రంగంలోకి దిగడంతో మెత్తబడిన గంటా నేటి సీఎం పర్యటనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.