తెలంగాణలోని వనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిపై నిత్యం అనుమానిస్తూ వేధిస్తున్న భర్తను గొంతు కోసి అతి కిరాతకంగా చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన వనపర్తి జిల్లా మందడి మండలం స్కూల్ తండా గ్రామంలో కలకలం రేపుతోంది. పుల్యా తండాకు చెందిన బాల్య నాయక్‌కు మణెమ్మతో కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. అయితే వీరికి ఒక కూతురు కూడా ఉంది. బాల్య నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబంతో కలిసి సొంతూరుకు చేరుకున్నాడు.
కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న బాల్యనాయక్… రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటుండటంతో ఆమెను తరుచూ వేధించసాగాడు. ఆమెకు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగడుతూ నానా హింసలకు గురిచేస్తున్నాడు. అందుకు తోడు ఈ మధ్య మద్యానికి బానిసైన అతడు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడుతుండటం మొదలు పెట్టాడు. కాగా తాజాగా గత రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త వేధింపులతో విసిగిపోయిన మణెమ్మ కూతురి సాయంతో నిద్రమత్తులో ఉన్న భర్తను గొంతు కోసి చంపేసింది. ఈ ఘటనపై వెంటనే తెలుసుకున్న పోలీసులు బుధవారం గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.