Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో అనిపిస్తోంది. కొంత మంది భార్యలు అక్రమసంబంధం కోసం కట్టుకున్న భర్తలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. కొంత మంది అయితే సుపారీ ఇచ్చి మరీ భర్తలను చంపిస్తున్నారు. ఇన్నాళ్లూ పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుని భార్యలను చంపించే మృగాళ్లను చూశాం. కానీ ప్రియుడి మోజులో పడి మొగుడి ప్రాణాలు తీస్తున్న భార్యలు ఈ మధ్య కాలంలో పెరిగారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు విస్తుగొలుపుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో నాగర్ కర్నూల్ స్వాతితో మొదలయిన ఈ తరహా ఘటనలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. సుకుమారంగా ఉండే మహిళలు ఇంత ఘోరంగా పథకాలు రచించి మరీ హత్యలు చేయడం పోలీసుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నాయి.
తాజాగా అటువంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు భర్తను దారుణంగా చంపించింది. దోపిడీ దొంగలు చేసిన పనిగా చిత్రీకరించి కేసు నుండి బయట పడాలని చూసిన ఆమె పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నిజాలు కక్కేసింది. పోలీసుల వివరాల ప్రకారం గరుగుబిల్లి మండలం తోటపల్లిలో కొత్త జంట బైక్ మీద వస్తుండగా… దుండగులు దాడి చేశారు. నవ దంపతులపై దాడి చేసిన అనంతరం దోపిడిదొంగలు నగలు అపహరించుకుపోయారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. దీంతో ప్రతిఘటించిన భర్తపై దుండగులు దాడి చేసి చంపారు. అనంతరం పరారయ్యారు. బాధితులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
అయితే ఈ దాడిలో భర్త గౌరీశంకరరావు మృతి చెందాడు. భార్య సరస్వతి కి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇష్టంలేని పెళ్లి కారణంగానే గౌరీశంకరరావును భార్య సరస్వతి హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తు లో తేలింది, సరస్వతి తన ప్రియుడు శివ, విశాఖ రౌడీషీటర్ గోపితో సుపారీ మాట్లాడి భర్తను హత్య చేయించిందని తెలుస్తోంది. ఆమె పథకం ప్రకారమే వారి వద్ద ఉన్న నగలు అపహరించారు. వాటిని ఎత్తుకెళ్ళిన వారిని దొంగలుగా చిత్రీకరించి వారి దాడిలో తన భర్త మరణించాడు అని నమ్మించాలని చూసింది సరస్వతి. నగలు తీసుకురావాలని సుపారీ గ్యాంగును కోరడంతో వారు హ్యాండ్ ఇచ్చారు. కానీ పోలీసులకి అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించే సరికి సరస్వతి నిర్వాకం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.