రాబోయే సాధారణ ఎన్నికలకి ఎపీలోని అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు, ఇక జగన్ సంగతి సరే సరి ఆయన ఏడాది క్రితమే ఆ మూడ్ లోకి వెళ్లి పాదయాత్ర మొదలుపెట్టారు. అలాగే సంక్రాంతి తర్వాత వంద మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని జాగ్రత్తగా పనిచేసుకోవాలని చంద్రబాబు ప్రకటించారు. ఇది ఓ రకంగా ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం లాంటిదే. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుకు చివరి నిమిషం వరకూ టిక్కెట్లను ఖరారు చేయరు. అలాంటి నేత మూడు నెలల ముందుగానే టిక్కెట్ల జాబితా ప్రకటిస్తారంటే ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించి కేసీఆర్ లాభపడిన విధానం చూసి చంద్రబాబు ఈ ప్రకటన చేశారని కనీసం ఓ వంద మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే చంద్రబాబు ప్రకటన విన్న ఆశావహులు, సిట్టింగ్ లు తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటిస్తే జగన్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. ఆయన ముందస్తు ప్రకటనలేమీ చేయకుండానే బాబు కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు !. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర జనవరి ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన ముగియనుంది. అక్కడ గుర్త్గుగా పైలాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ముగింపు సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనే ఆయన ఓ 100 మంది అభ్యర్థులను ప్రకటిస్తారంటున్నారు. అయితే కొన్ని నెలలుగా వైసీపీని పరిశీలిస్తే జగన్ చాలా మందిని ఇన్చార్జులుగా తప్పించారు. వీరిలో అత్యంత నమ్మకస్తులైన వారు ఉన్నారు. వారెవరికీ చివరి నిమిషంలో కూడా టిక్కెట్లు ఇవ్వడం లేదని.. కొత్తగా సమన్వయకర్తలుగా నియమించిన వారికే టిక్కెట్లు ప్రకటించబోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే ఒక క్లారిటీ వస్తుందని ఆయన మాత్రం ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలు సామాజిక సమీకరణాలు చూసుకుని ఇప్పటికే జాబితా రెడీ చేశారని అంటున్నారు.