ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచి క్రేజ్ ఉన్న నాయకుల కోసం నానా తిప్పలు పడుతున్నాయి రాజకీయ పార్టీలు. అందుకే కుదిరితే పక్క పార్టీలలో ఉన్న నాయకులను కూడా సాధ్యమైనంత దగ్గరకు తీసుకుంటున్నారు. అయితే అసలు ఏ పార్టీకీ సంబంధం లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరతారు. ప్రస్తుతానికి ఏపీలోనే రాజకీయాలకు పరిమితమవుతా అని ఆయన చెబుతున్న నేపధ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలోనూ తొలిచేస్తోంది.
అయితే ఏపీలో ఉన్న పార్టీల ప్రకారం చూస్తే జగన్ పెట్టిన వైసీపీ లో లక్ష్మీ నారాయణ చేరే అవకాశం లేదు. ఎందుకంటె సీబీఐ లో ఉన్నప్పుడు జగన్ కేసులను టేకప్ చేసింది ఆయనే కాబట్టి జగన్ మీద లక్ష్మీ నారాయణకు సదభిప్రాయం లేదు. ఇక బీజేపీ నుండి ఇప్పటికే ఆహ్వానం అందినా లక్ష్మీ నారాయణ మాత్రం తటస్థంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ నుండి అవకాశం వచ్చినా పార్టీ లో చేరలేదు. రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న ఆయనని టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగానే ఉంటుందని టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతున్నా టీడీపీ అధినాయకత్వం ఎందుకు ఆ దిశగా ఆలోచించటం లేదు అని రాజకీయ వర్గాల్లో సైతం చర్చ సాగుతుంది.
ఇటీవల తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన లక్ష్మినారాయణ తాను గమనించిన అంశాలతో ముఖ్యమంత్రికి ఓ వినతి పత్రం అందించారు. అప్పుడు చంద్రబాబును కలిసిన ఆయనతో పార్టీ లో చేరే ప్రస్తావన ఏమైనా చేస్తారేమో అని అందరూ ఆసక్తిగా చూసారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి తాను రూపొందించిన పీపుల్స్ మ్యానిఫెస్టోను అందించి ఆచరణలో పెట్టాలని.. కోరేందుకు మరోసారి ఆయన సీఎం చంద్రబాబును కలిసే అవకాశం వుంది. అప్పుడైనా ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ.
వైసీపీ అధినేత జగన్ కేసులు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఆ కేసులను విచారించిన అధికారిగా లక్ష్మినారాయణ టీడీపీలో చేరితే కేసుల మీద ఆ ప్రభావం ఉంటుందన్న ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉంది. అంతే కాకుండా లక్ష్మినారాయణ బీజేపీతో.. ఓ ఒప్పందానికి వచ్చే తన రాజకీయప్రస్తానం ప్రారంభించారన్న అనుమానాలు కూడా టీడీపీ అగ్రనేతల్లో ఉండటం వల్ల ఆయనను పార్టీ లోకి ఆహ్వానించటానికి సంశయిస్తున్నారు. మరి ఇప్పటికైతే టీడీపీ మాజీ జేడీ విషయం లో ఏ నిర్ణయం తీసుకోని టీడీపీ మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.