సంక్షేమ పథకాలతో వైసిపి ప్రభుత్వం ఈసారి కూడా తమదే గెలుపు అనే ధీమాతో ఉంటే, సొంత పార్టీ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో వైసిపికి షాక్ ఇస్తున్నారు. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈస్ట్ రాయలసీమలో జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సమావేశాలు పెడుతూ నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలకు, కార్యకర్తలకు విజయసాయిరెడ్డి తాజాగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి భారీగా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం, వారి అనుచరులు భారీగా హాజరయ్యారు. విజయ సాయి రెడ్డి ఎదురుగాని తమ బలాబలాలు ప్రదర్శించేందుకు సమాయత్తమయ్యారు. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నేతలందరూ విరుచుకుపడ్డారు.
సంతనూతలపాడు లో ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు, నాగులుప్పాడు ఎంపీపీ అంజమ్మ భర్త కృష్ణారెడ్డి వర్గాలు విజయసాయిరెడ్డి ఎదురుగాని కొట్టుకునేందుకు సిద్ధమయ్యాయి.
మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. స్థానికేతురుడైన సూర్యప్రకాష్ ను మీటింగ్ కి ఎందుకు పిలిచారని నాగార్జున రెడ్డి అనుచరులు గొడవ చేశారు. విజయ సాయి రెడ్డి, నాగార్జున రెడ్డి అనుచరులని మందలించారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అన్నా మాకొద్దు అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
కొండపిలో ఇంచార్జ్ అశోక్ బాబు తీరుపై సొంత పార్టీలోనే వైరీవర్గం ఎక్కువగా ఉంది. ఈసారి టికెట్ అశోక్ బాబుకి ఇస్తే వైసీపీకి తమ ఓట్లు పడవని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ప్రకాశంలో వైసీపీకి సొంత పార్టీ వాళ్ళే చెక్ పెట్టేలా ఉన్నారు.