మోదీ, జిన్‌పింగ్‌ భేటీ ఉంటుందా?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!

Meeting between Modi and Xi Jinping
Meeting between Modi and Xi Jinping

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఇవాళ్టి నుంచి బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు ఖరారు కావాల్సి ఉందని, భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా కూడా దీనిపై నేరుగా సమాధానమివ్వలేదని తెలిపారు.

వాస్తవాధీన రేఖ వెంబడి 2020లో ఇరు దేశాల సైన్యాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణాత్మక పరిణామాల తర్వాత మోదీ, షీ జిన్‌పింగ్‌ భేటీ జరగలేదు. గతేడాది జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేసియాలోని బాలిలో విందు సందర్భంగా కాసేపు మాట్లాడుకున్నారు అంతే. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు బ్రిక్స్‌ సదస్సులో కలయికపై ప్రచారం జోరుగా సాగుతుంది. ఇవాళ ఓవైపు మోదీ.. మరోవైపు జిన్ పింగ్ దక్షిణాఫ్రికాకు పయనం కానున్నారు. బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌ సభ్యదేశాలు. ఒక్క రష్యా తప్ప మిగిలిన దేశాధినేతలంతా ఈ సదస్సులో పాల్గొననున్నారు.