ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వం ఈ మూడు అంశాలపైనా వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు సిద్ధమవుతుంటే ఇప్పుడు మరో బాధితురాలు తెరపైకి వచ్చింది. ‘నిఖా హలాలా’ పద్ధతిలో పలుమార్లు విడాకులు ఇవ్వడమేకాదు మరికొందర్ని పెళ్లి చేసుకునేలా తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు వాపోతోంది. మొదట షబీనాకు ఒకరితో పెళ్లైంది. అయితే ఆమెపై మోజు తీరిన తర్వాత తలాక్ చెప్పాడు. ఆ తర్వాత ‘నిఖా హలాలా’లో భాగంగా మామను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అప్పుడు మామ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలని షబీనాకు చెప్పారు. అయితే ఇది అంతటితో ఆగలేదు. మొదటి భర్తతో మళ్లీ పెళ్లి ఆ తర్వాత మళ్లీ విడాకులు ఈసారి బావను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు.
ఇలా పెళ్లి విడాకులు. మళ్లీ పెళ్లి మళ్లీ విడాకులు అంటూ ఆమెను సెక్స్ బానిసని చేసేందుకు ప్రయత్నాలు చేయడం వల్ల ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించింది షబీనా. ఎదురుతిరిగినందుకు తనను షరియత్ చట్టాలను అపహాస్యం చేస్తున్న కారణానికి బహిష్కరించడమే కాదు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తామని “తమ సామాజికవర్గానికి చెందినవారు” బెదిరించారంటోంది బాధితురాలు. దీంతో తలాక్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల సహాయాన్ని బాధితురాలు కోరింది. స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధుల కోరిక మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.