Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ ప్రజలు అమ్మగా భావించే జయ నిజ జీవితంలో పెళ్లి లేదు. అయితే ఆమె తల్లి అయ్యిందన్న వార్తలు అడపాదడపా వినిపించేవి. ఆ వార్తలు పబ్లిసిటీ స్టంట్ గానే జనం చూసారు. అందుకు తగ్గట్టే ఆలా చెప్పుకున్న వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు నేను జయ కూతురును అంటూ సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టిన అమృత కథ మాత్రం ఏదో కొత్తగా అనిపిస్తోంది. జయకు సంతానం వున్న మాట నిజమే అని ఆమె మేనత్త కుమార్తె లలిత కూడా ఓ తమిళ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో అమృత మాటలకు కాస్త బలం చేకూరింది. ఈ అమృత డిఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధం అని చెప్పడంతో తమిళుల్లోనూ కాస్త సందేహం మొదలయ్యింది. నిజానికి అమృత మాటల్లో బలం లేకుంటే ఇప్పటికే జయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున గొడవ చేసేవాళ్ళు. ఈసారి ఆ వాతావరణం కనిపించడం లేదు. జయ వారసత్వాన్ని కోరుకుంటున్న వాళ్ళు మాత్రమే అమృత మాటలను తప్పుబడుతున్నారు తప్ప సామాన్యులు కాదు.
అమృత వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదు. కోర్ట్, డిఎన్ఏ పరీక్షలు ద్వారా జరగాల్సిన వ్యవహారం కావడంతో ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేము. అసలు ఎప్పటికైనా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందో, లేదో కూడా చెప్పలేం. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే సెలబ్రిటీ అన్న మాట అది రాజకీయ రంగం కావొచ్చు , సినిమా రంగం కావొచ్చు వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా కట్టడి చేసుకోవాల్సి వస్తుందో అర్ధం అవుతుంది. సెలబ్రిటీ అనేది కేవలం ప్రతిష్ట కాదు అది భుజాల మీద వుండే పెద్ద బరువు. ఆ బరువు ను మోయడానికి ఒక్కోసారి మాతృత్వాన్ని కూడా రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి. దూరం నుంచి చూసినప్పుడు ఇదేదో డబ్బున్న వాళ్ళ బాధ్యతారహిత చేష్టగా అనిపించవచ్చు. కానీ అమ్మతనాన్ని దాచుకోవడం, ఆ ప్రేమను ట్యూన్ తుంచుకోవడం అనుకున్నంత చిన్న విషయం కాదు. దాన్ని భరిస్తూ మొహాన నవ్వు పులుముకోవడం కన్నా పెద్ద విషయం ఏముంటుంది ?