Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పోలవరం ప్రాజెక్టు విషయంలో కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిలో ఆరోపించారు. కొందరు డబ్బులురానివ్వకుండా చేయాలనుకుంటున్నారని, ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తోన్న రైతులను రెచ్చగొట్టాలని కుట్రలుపన్నారని మండిపడ్డారు. పోలవరం దేశసంపదని, ఇందులో కుట్రలు వద్దని చంద్రబాబు కోరారు. దేశంలో డీపీఆర్ -1 పూర్తిగా ఖర్చుపెట్టిన ప్రాజెక్టు పోలవరం మాత్రమేనని, ఆ ప్రాజెక్టు కోసం తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు. పట్టిసీమ పనికిరాకుండా పోవడం, పోలవరం పూర్తి కాకూడదనేదే బీజేపీ కుట్ర అని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికేసులు వేస్తారని, కేంద్రప్రభుత్వాన్ని కూడా కాగ్ తప్పుబట్టిందని, మరి కేంద్రంపై కూడా కేసులువేస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై దాడిచేయడం… ప్రజాస్వామ్యమా అని ఆయన నిలదీశారు. పోలవరంపై చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అడ్డుతగిలారు. దీంతో మీరే మాట్లాడంటంటూ చంద్రబాబు తనసీట్లో కూర్చున్నారు. ప్రసంగం కొనసాగించిన మాధవ్ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రప్రభుత్వం కట్టుబడిఉందని చెప్పారు. పోలవరం భూసేకరణ, పునరావాసాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలని కేంద్రం చెప్పలేదని స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరించబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. బీజేపీపై ఎవ్వరూ అనుమానాలు వ్యక్తంచేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని, ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాం కాబట్టి సహకారం అందబోదని టీడీపీ అనుకోవడం భావ్యం కాదన్నారు.
అనంతరం ప్రసంగించిన చంద్రబాబు పోలవరం పునరావాసం బాధ్యత కేంద్రానిదే అనుకున్నప్పుడు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతోంటే బీజేపీ ఎందుకు తప్పుబట్టలేదని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లను ప్రధాని ఎందుకు కలుస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పీఎంవోలో కూర్చోవడం, ప్రెస్ వారికి కనపడకుండా దాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, నేరస్తులకు పీఎంవో గస్తీ కాస్తోందా అని నిలదీశారు. ఏపీ ముఖ్యమంత్రిని కోర్టు బోనులో నిలబెట్టేవరకు మేము ప్రధానిని కలుస్తూనే ఉంటామని వైసీపీ నేతలు అంటున్నారని, కలుసుకోండి, కాపురాలు కూడా పెట్టుకోండి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్నటివరకు బాగానే ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా టీడీపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. తమకు హైకమాండ్ ఢిల్లీలో లేదని, ఐదుకోట్ల మంది ప్రజలే తమ హైకమాండ్ అని చంద్రబాబు అన్నారు.