World Cup 2023: Breaking : ఆరోసారి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా

World Cup 2023: Breaking : Australia won the world cup for the sixth time
World Cup 2023: Breaking : Australia won the world cup for the sixth time

కొత్తగా ఏం జరుగలేదు. వన్డే వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ మొత్తం అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఇరగదీసిన భారత్‌, ఫైనల్‌లో ఎప్పటిలాగే తడబడింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు… 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు.

ఆసీస్ బౌలర్లు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్లు స్టార్క్, హేజెల్ వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులకు ఆలౌట్ చేయగా… 241 పరుగుల లక్ష్యఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీతో అదరగొట్టాడు. హెడ్ కు లబుషేన్ తోడవడంతో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా విఫలయత్నాలు చేసింది. లబుషేన్ 58 పరుగులు చేయగా, హెడ్ 137పరుగులతోనూ అజేయంగా నిలిచారు. హెడ్ 120 బంతులాడి 15 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, షమీ, సిరాజ్ తలో 1 వికెట్ తీశారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి టీమిండియా నేడు ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావిస్తే, ఆస్ట్రేలియా జట్టు తాను అంచనాలకు అందే జట్టును కాదంటూ వరల్డ్ కప్-2023 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గతంలో 1987, 1999, 2003, 2015లోనూ వన్డే వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గింది.