గన్నవరం వైసీపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాకతో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా జగన్ మాత్రం వంశీవైపే మొగ్గు చూపడంతో యార్లగడ్డ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఇవాళ మరోమారు భేటీ అయిన యార్లగడ్డ తన నిర్ణయం ప్రకటించారు. త్వరలో చంద్రబాబును కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
ఇవాళ యార్లగడ్డ వెంకట్రావు తన అనుచరులతో భేటీ అయి వైఎస్సార్ సీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పారు. నాయకులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీ చేసానని గుర్తుచేసుకున్నారు. అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లైందన్నారు. గన్నవరం లో వైసీపీ గెలవడమే ద్యేయంగా పనిచేశానని తెలిపారు. టిక్కెట్ ఇవ్వమని మాత్రమే సీఎంను అడిగానన్నారు. పార్టీ పెద్దలకు ఏమి అర్ధమైందో నాకు తెలియలేదన్నారు.
ప్రభుత్వం వచ్చినా తమపై కేసులు కొనసాగాయని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డను ఎక్కడైనా సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. ఉంటే ఉండు….పోతే పొమ్మని సజ్జల చెప్పడం తనకు చాలా బాధ,ఆవేదన కలిగించిందన్నారు. టీడీపీ కంచుకోటలో ఢీ అంటే ఢీ అని పోరాడానని యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు. నా బలం ఇప్పుడు బలహీనత అయిందా అని సజ్జలను ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని అడిగారు.
మూడేళ్ళుగా తనకు ఏ ప్రత్యామ్నాయం చూపించలేదని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. తడిగుడ్డతో గొంతు కోయడం అనేది నా విషయంలో నిజమైందన్నారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందన్నారు. కొంతమంది ఇండిపెండెంట్ అని…కొంతమంది మీ నుర్ణయం అని చెప్తున్నారన్నారు.
ఇంతవరకూ ఎంతమంది కలుద్దామని ప్రయత్నం చేసినా చంద్రబాబు ను లోకేష్ ను,టీడీపీ కలవలేదన్నారు. నేను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. తాను టీడీపీ నేతలను కలిశానని మీరు ఎలా నమ్మారని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు.తాను వైసీపీకి ద్రోహం చేయలేదని, పార్టీని వాడుకోలేదని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. త్వరలో చంద్రబాబును కలుస్తానని, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.