సుమలత కోసం హీరో తమ్ముడు !

కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దివంగత సినీ నటులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంహెచ్ అంబరీష్ భార్య, సినీ నటి సుమలత స్పష్టం చేశారు. ఈ నెల 20 న నామినేషన్ దాఖలు చేస్తానని సోమవారం తెలిపారు. మాండ్య నుంచి కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో ఆమె తలపడనున్నారు. నిజానికి ముందు నుండి ఆమె కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తున్నారు. అయితే జేడీఎస్ కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా ఆ సీటు జేడీఎస్ కు వెళ్ళింది. అయితే కాంగ్రెస్ కి, అంత కన్నా ఎక్కువగా అంబరీష్ కి పట్టు ఉన్న ఆ స్థానం జేడీఎస్ కు వెళ్ళడం ఇష్టం లేకే ఆమె పోటీలో నిలిచిందని అంటున్నారు. అయితే క‌న్న‌డ హిట్ చిత్రం కేజీఎఫ్‌ తో ప్యాన్ ఇండియా స్టార్ అయిన యష్ ఇప్పుడు సుమలత కోసం ప్రచారం చేయనున్నాడు. అంబ‌రీష్ బతికున్న స‌మ‌యంలో య‌ష్ త‌న కుమారుడితో స‌మాన‌మ‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆ రుణం తీర్చుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే య‌ష్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్న సుమ‌ల‌త‌కు అండ‌గా నిలుస్తున్నాడ‌ని క‌న్న‌డ మీడియా చెబుతోంది. కేజీఎఫ్‌ స‌క్సెస్‌పై సుమ‌ల‌త ట్విట్ట‌ర్‌లో అభినంద‌న‌లు తెలియ‌జేస్తే య‌ష్ ఆమెను అక్కా అంటూ సంబోధించ‌డం పలువురిని ఆక‌ట్టుకుంది. అక్క కోసం త‌మ్ముడు చేస్తున్న సాయంగా మాండ్య ఎన్నిక‌లు నిలుస్తాయ‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?