Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తప్ప… సొంత పక్షం నుంచి ఎలాంటి మద్దతూ లభించకపోయినప్పటికీ… యశ్వంత్ సిన్హా మాటల దాడి ఆపలేదు. మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిందని వ్యాఖ్యానించి గతంలో కలకలం రేపిన యశ్వంత్ సిన్హా మరోమారూ అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ సారయితే ఓ అడుగు ముందుకేసి మోడీని సుల్తాన్ ల పాలనలో పిచ్చిరాజుగా చెప్పుకునే మహ్మద్ బిన్ తుగ్లక్ తో పోల్చారు. మోడీ ఇప్పుడు తెచ్చిన నోట్ల రద్దును 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్ అయిన మహ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే తీసుకొచ్చారని యశ్వంత్ సిన్హా చెప్పారు. ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. కొంతమంది పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా… కొత్త వాటిని ప్రవేశపెట్టారని, అలాగే తుగ్లక్ కూడా పాత కరెన్సీని రద్దుచేసి సొంత కరెన్సీ తీసుకొచ్చారని, అంటే 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు జరిగిందని తెలుస్తోందని సిన్హా వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు, జీఎస్టీపై లోక్ షాహి బచావో అభియాన్ అనే ఓ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో యశ్వంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన సూచించారు. అటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై యశ్వంత్ ఎన్నిసార్లు విమర్శలు చేసినప్పటికీ అధికార పక్ష నేతలెవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదు. యశ్వంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా ఒక్కడే గతంలో సమర్థించారు… అది కూడా మోడీపై అత్యంత వినయ విధేయతలు ప్రదర్శిస్తూనే యశ్వంత్ కు మద్దతిచ్చారు. ఆయన తప్ప ఇంకెవరి నుంచీ యశ్వంత్ కు మద్దతు ఇచ్చే వారు లేరు.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ నేత ఒకరు ప్రభుత్వంపైన బహిరంగ విమర్శలకు దిగితే… మిగిలిన అసంతృప్తులు కూడా వంతపాడతారు. కానీ యశ్వంత్ సిన్హాకు మాత్రం బీజేపీ నేతల నుంచి అలాంటి మద్దతు దొరకడం లేదు సరికదా… వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి నోట్ల రద్దు నిర్ణయాన్ని యశ్వంత్ సిన్హా బహిరంగంగా విమర్శించినప్పుడు చాలామంది బీజేపీ నేతలు మోడీ తీరును తప్పుబడతారని అంతా భావించారు. కేంద్రమంత్రులు చాలా మంది మోడీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, యశ్వంత్ సిన్హాకు వారంతా మద్దతుగా నిలుస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తేలిపోయింది. నోట్ల రద్దు, జీఎస్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ… కేంద్ర మంత్రులెవరూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసించడం లేదు. అర్ధమయింది.