గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మైనింగ్ వ్యవహారం పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. గురజాలలో జరుగుతున్న మైనింగ్ ప్రాంతాన్ని వైసీపీ నేతలు పరిశీలించడానికి మైనింగ్ జరుగుతున్న పల్నాడులోని కోనంకి, కేశానపల్లి, సీతారామపురం,నడికుడి ప్రాంతాల్లో వైసీపీ నేతల పర్యటన చేయాలనుకుంది. అయితే వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో పోలీసులు ముందుగానే జాగ్రత్తపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల్ని ముందస్తుగానే హౌస్ అరెస్ట్‌లు చేశారు. భారీగా బలగాలను కూడా మోహరించారు. దాచేపల్లి, పిడుగురాళ్లలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని గత నెల 26న అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి ద్వారా 100ల కోట్లు పన్ను ఎగవేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. దీంతో వైసీపీ దీనిని రాష్ట్ర స్థాయి సమస్యగా మార్చాలని భావించి ఒక నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. దీంతో ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే దాచేపల్లి బయల్దేరిన బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు దాచేపల్లి, పిడుగురాళ్ల వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. వైసీపీ నేతల హౌస్ అరెస్ట్‌లతో పల్నాడు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పోలీసులు పెంచారు. వైసీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటనపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే అక్రమమైనింగ్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సరస్వతి భూముల విషయంలో రైతులకు అండగా నిలిచినందుకే తనను వైసీపీ టార్గెట్ చేసిందని.. అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.